హిందూ సంప్రదాయం

సహజంగానే స్త్రీలకు భక్తి భావం ఎక్కువగా వుంటుంది. పూజ కోసం పూలు కోయడం; వాటిని మాలగాకట్టి దైవానికి సమర్పించడంలో వాళ్లు ఎంతో సంతోషాన్ని; సంతృప్తిని పొందుతుంటారు. పూజలు; అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ వుంటారు. శ్రావణ; కార్తీక మాసాల్లో వాళ్లు మరింత తీరికలేకుండా వుంటారు.అలాంటి యువతులు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు చేయవచ్చా లేదా అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలనీ; కొబ్బరికాయను మాత్రం కొట్ట కూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ; పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదని అంటోంది.కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం; కోటి స్తోత్రాలు చదవడంకన్నా ఒకసారి జపం చేయడం; కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.పూజల పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి; అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులుపడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది. ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది; అది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది కనుక ధ్యానం చేయడమే మంచిదని పండితులు కూడా చెబుతుంటారు.