మహాభారతం

ధర్మరాజు : దండనీతి దండనీతి అంటారు కదా! ఈ దండం లేకుండా ప్రేమతో పనులు చేయరంటావా? ప్రజలు?భీష్ముడు : దండం లేకుండా ఒట్టి ప్రేమతో పనులు అయిపోతాయా? సైగలతో ప్రేమతో చెబితే ఎవ్వరూ పనులు చేయరు.దండం చాలా అవసరం. దండం లేకపోతె చాలా ప్రమాదం. అది ఎలా వచ్చిందో చెబుతాను విను.సృష్టి ఆరంభకాలంలో విష్ణుమూర్తి అత్యద్భుత దండ రూపం ధరించాడు. దండము అంటే కర్ర; దండము అంటే ఎవరు ఎలా మెలగాలో చెప్పే నీతి. ఎప్పుడూ ఈవ్యక్తి ఈ పని చేయాలి. ఈపని చేయకపోతే వేడిని రాజు ఇలా శిక్షించాలి. అని ఒక నీతిని శ్రీమహావిష్ణువు శాస్త్ర రూపంలో సృష్టించి ఇచ్చాడు. దానిని మొట్టమొదటి మనువు అయిన స్వయంభువ మనువు పాలించాడు. విష్ణువు ఇచ్చిన దండనీతి ప్రకారం ప్రజలని ఎలా పరిపాలించాలి? ఎవడు తప్పు చేస్తే ఏ శిక్ష విధించాలి? అవినీతికి ఏమి ఇవ్వాలి? హింసకి ఏమి ఇవ్వాలి? సామాన్యుడికి ఎలా ఇవ్వాలి? పెద్దవాడికి ఎలా ఇవ్వాలి? ఇవన్నీ చెప్పాడు. ఈదండమే లేకపోతె ప్రజలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. భయం లేదు కాబట్టి అక్రమాలు ఎక్కువైపోతాయి. ఎవడు పడితే వాడు విచ్చలవిడి అయిపోతాడు. అందరూ కోట్లు సంపాదించి అక్రమంగా దాచి ప్రజలందరినీ నాశనం చేసేస్తారు. కనుక సక్రమంగా సంపాదన రావడానికి; కష్టించే లక్షణం కలగడానికి; అవినీతిని తురమడానికి దండనీతి ఉండాలి. ఈ దండనీతికి శ్రీ అని; సరస్వతి అని రెండు మారుపేర్లు ఉన్నాయి. లక్ష్మి విద్య ఈ రెండు కూడా దండనీతిలో భాగాలు. పూర్వం వసుహోముడు అనే మహారాజుగారు మాంధాత మహారాజు గారికి కనబడ్డాడు. అప్పుడు మాంధాత అయ్యా! దండనీతి ఎలా పుట్టింది? దాని విశేషాలు తెలుపండి అనగా అప్పుడు వసుహోముడు ఇలా చెప్పాడు.సృష్టి అరంభసమయం అది. అప్పుడు బ్రహ్మ ఒక యజ్ఞం చేయాలి అనుకున్నాడు. యజ్ఞం చేయాలి అంటే ఖర్చుతో కూడుకొన్నది; మంది మార్భలంతో కూడినది. యజ్ఞం చేయాలి అనుకున్న బ్రహ్మకి యజ్ఞం చేసే ఒక ఋత్విక్కు కావలసిన అవసరం వచ్చింది. అది సృష్టి ఆరంభకాలం కనుక యజ్ఞం చేసే ఋత్విక్కు లేడు. కనుక తన చేతిలో ఉన్న కిరణాలని తన గర్భంలో నిక్షిప్తం చేశాడు. అలా గర్భం ధరించిన బ్రహ్మ వెయ్యేళ్ళు ఆగర్భాన్ని మోశాడు. స్త్రీలాగా ప్రసవించే అవకాశం లేదు కనుక హచ్చి అని ఒక తుమ్ముతుమ్మాడు. తుమ్మడంతో కడుపులో ఉన్న బిడ్డ బయటికి వచ్చాడు. తుమ్ము నుండి పుట్టాడు కనుక ఆపుట్టిన వాడికి “క్షుతుడు” అని పేరుపెట్టాడు. క్షుతము అంటే తుమ్ము. వెంటనే బ్రహ్మ “నువ్వు ఋత్విక్కుగా నాచేత యజ్ఞం చేయించు” అన్నాడు. సరేనని అక్కడి నుండి వెళ్లి ఋత్విక్కులని పిలిచి “అయ్యా మీరందరూ ఈపని చేయండి అని అడిగాడు. ఎవ్వరూ ఏపని చేయడంలేదు. కూర్చున్న చోట నుండి లేవడం లేదు. మంచినీరు తీసుకురావడం లేదు.